తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్లైయాష్ వివాదంపై దిగొచ్చారు. అల్ట్రాటెక్ యాజమాన్యానికి క్షమాపణలు అంటూ ఓ పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకొని దాని ముందు కూర్చుని ఆయన క్షమాపణలు చెప్పారు. తాను డబ్బుల కోసం ఆ బూడిద కోసం పట్టుబట్టలేదని, అది తన ప్రతిష్ట అని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంలో ఎంత మందిని సంప్రదించినా స్పందన లేదని అందుకే క్షమాపణలు చెబుతున్నానన్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎన్టీపీసీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్ సరఫరా చేసే విషయంలో వివాదం ఏర్పడింది. జమ్మలమడుగు కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గానికి చెందిన లారీలు ఎన్టీపీసీ ఫ్లైయాష్ను అల్ట్రాటెక్కు సరఫరా చేస్తున్నాయి. కాగా, తన నియోజకవర్గంలోకి లారీలు వస్తున్నాయి కాబట్టి తన లారీలే సరఫరా చేయాలని జేసీ పట్టుబట్టారు. దీంతో వివాదం ఏర్పడింది.
ఇద్దరి నేతలతో మాట్లాడి సంధి చేసేందుకు సీఎం చంద్రబాబు ఇరు వర్గాలను పిలిచినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. దీంతో ఆయన లారీలు అక్కడే ఉండిపోవడంతో సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లైయాష్ తరలింపు ఆగిపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కితగ్గారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీపై ఆధారపడి చాలా కుటుంబాలు బతుకుతున్నాయని అందుకే యాజమాన్యానికి క్షమాపణలు చెప్పినట్లు వివరించారు.







