రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. న్యాయవాదుల సమక్షంలో పేర్ని జయసుధ విచారణ జరగింది. గోదాం నుంచి బియ్యం ఎందుకు మాయం అయ్యాయి.? ఎలా మాయం అయ్యాయనే ప్రశ్నలు ఆమెను అడిగినట్లు సమాచారం. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు ఇటీవల కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైసీపీ నేత పేర్ని నానిని ఏ6గా చేర్చారు పోలీసులు.
న్యూఇయర్ రోజున పేర్ని జయసుధను విచారణకు పిలవడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. స్పైనల్ కార్డ్ సమస్యతో బాధపడుతూ జయసుధ విచారణకు హాజరయ్యారని, ఆరోగ్యం బాగోలేకపోయినా విచారణకు రావాల్సిందేనని పోలీసులు నోటీసులు ఇచ్చారని, విచారణ సమయంలో జయసుధతో పాటు లాయర్లను పోలీసులు అనుమతించలేదని, జయసుధతో పాటు వచ్చిన వైసీపీ మహిళా నేతలను సైతం పోలీసులు బయటికి పంపించేశారని స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.