రంగంపేట (Rangampeta) మహిళా కానిస్టేబుల్ (Woman Constable) జయశాంతి (Jayasanti) వ్యవహారం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదంగా మారింది. చంటి బిడ్డను చేతుల్లో ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారింది. ఆమెకు మద్దతుగా నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తుండడంతో హోంమంత్రి అనిత (Anitha) జయశాంతి దంపతులను ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టి మరీ సన్మానించి, ఆ వీడియోను బయటకు వదిలారు. అయితే, హడావుడి వెనుక అసలు కథ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
గత ఏడాది నిర్వహించిన డీఎస్సీ (DSC)లో జయశాంతి తప్పుడు ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందినట్లు విద్యాశాఖ అధికారులు నిర్ధారించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భర్త తాతారావు (Thatarao) ఆదాయాన్ని దాచిపెట్టి, తండ్రిని సంరక్షకుడిగా చూపుతూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ పొందినట్లు విచారణలో తేలింది. దీంతో జయశాంతికి మంజూరైన డీఎస్సీ ఉద్యోగాన్ని విద్యాశాఖ అధికారులు రద్దు చేశారు. ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు భావించి, తగిన చర్యలు తీసుకోవాలంటూ కాకినాడ జిల్లా డీఈవో, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇక మరోవైపు, నకిలీ ఐడీ కార్డుతో ఎస్ఐగా చలామణి అవుతున్న కామేశ్వరరావు (Kameswara Rao) అనే హెడ్ కానిస్టేబుల్‌కు జయశాంతి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం కూడా ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా జయశాంతిని రైల్వే పోలీసు విభాగం నుంచి లా అండ్ ఆర్డర్ విభాగానికి బదిలీ చేశారు. అలాగే, ఆమె భర్త తాతారావును గతంలో రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి పల్నాడు ఎస్పీఎఫ్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.
ఈ మొత్తం వ్యవహారంలో మరో కీలక అంశం ఏమిటంటే.. వివాదాస్పద కానిస్టేబుల్ జయశాంతి దంపతులను హోంమంత్రి సన్మానించడంపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ సన్మానానికి సంబంధించిన వీడియోలను తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సోషల్ మీడియా విభాగం వైరల్ చేయగా, అప్పట్లో హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.
చంటి బిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసిన ఘటన కూడా ముందే ప్లాన్ చేసి చేసినదేనన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు అసలు నిజాలు వెలుగులోకి రావడంతో, “వివాదాస్పద కానిస్టేబుల్‌ను సన్మానించిన హోంమంత్రి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు?” అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై హోంమంత్రి సహా ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.








