టాలీవుడ్‌లో పెద్ద దుమారం రేపిన వివాదాల్లో ఒకటైన జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు కొత్త మలుపు తిరిగింది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన శ్రేష్టి వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. “నీకు తల్లి, చెల్లి లేరా? నీకు సిగ్గులేదా?” అంటూ సమీర్ అనే వ్యక్తిపై తీవ్రంగా స్పందించిన ఆమె, జానీ మాస్టర్ భార్య కూడా ఈ కుట్రలో భాగమేనని షాకింగ్ కామెంట్స్ చేశారు.
కేసు తీవ్రత – ఫిలిం ఛాంబర్ నివేదిక
శ్రేష్టి వర్మ గతేడాది నార్సింగి పోలీసులను ఆశ్రయించి, జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేయించారు. దీనిపై ఫిలిం ఛాంబర్ కూడా విచారణ నిర్వహించి, ఓ నివేదిక అందించినట్టు ఆమె తెలిపారు. ఈ నివేదికను త్వరలో కోర్టులో సబ్మిట్ చేయనున్నట్లు ప్రకటించారు.
సమీర్‌పై సంచలన వ్యాఖ్యలు
తనపై సమీర్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని, ఆయనకు మీడియా కూడా మద్దతు ఇస్తోందని ఆరోపించారు. “అతనికి కూడా తల్లి, చెల్లి ఉన్నారు కదా? భవిష్యత్తులో భార్య వస్తుంది కదా? అప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎలా?” అంటూ సమీర్‌ను సూటిగా ప్రశ్నించారు.
“రివేంజ్ కోసం కేసు పెట్టలేదు” – శ్రేష్టి వర్మ
సమాజం ఎవరిని నమ్ముతుందో తనకు తెలియదని, కానీ సత్యం కోసం పోరాడతానని శ్రేష్టి వర్మ తెలిపారు. “నేను ధైర్యంగా నిలబడతానని నిశ్చయించుకొని బయటకు వచ్చాను. సమాజం, సోషల్ మీడియా గురించి ఆలోచించలేదు” అంటూ ఎమోషనల్ అయ్యారు. తన లాంటి బాధితులు భయపడకుండా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.