బొలిశెట్టిపై జ‌న‌సేన వేటు.. పవన్ శాఖపై పోరాట‌మే కారణమా?

బొలిశెట్టిపై జ‌న‌సేన వేటు.. పవన్ శాఖపై పోరాట‌మే కారణమా?

జనసేన పార్టీ తన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణకు సంబంధించి సంచలన ప్రకటన చేసింది. సీనియ‌ర్ నాయ‌కుడు బొలిశెట్టి సత్యనారాయణతో పార్టీకి ఇకపై ఎటువంటి సంబంధం లేదని జనసేన స్పష్టం చేసింది. ఆయన చేపట్టే వ్యక్తిగత కార్యక్రమాలకు, చేసే వ్యాఖ్యలకు పార్టీకి ఎటువంటి బాధ్యత ఉండదని అధికారికంగా ప్రకటించింది.

పర్యావరణ అంశాలపై ప్రశ్నలు.. కూటమిపై విమర్శలు
గత కొంతకాలంగా బొలిశెట్టి సత్యనారాయణ చంద్ర‌బాబు ప్రభుత్వ నిర్ణయాలపై బహిరంగంగానే గళమెత్తుతున్నారు. ఇటీవల విశాఖలోని పావురాల కొండ పర్యావరణ విధ్వంసంపై ఆయన పాలకులను ప్రశ్నించారు. అలాగే, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై, జనసేనకు జరుగుతున్న అన్యాయంపై కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు.

కొల్లేరు వివాదం.. పవన్ కళ్యాణ్ శాఖపైనే గురి
తాజాగా కొల్లేరు సరస్సు పరిరక్షణ పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బొలిశెట్టి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. కొల్లేరులో ‘శాలినిటీ మిటిగేషన్’ (ఉప్పు నీటి నివారణ) పేరుతో ప్రభుత్వం రూ.2,952 కోట్లు ఖర్చు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కొల్లేరుపై శాస్త్రీయ అధ్యయనం లేకుండా వేల కోట్లు ఖర్చు చేయడం అశాస్త్రీయం. ఇది కొల్లేరు రక్షణ కోసం చేస్తున్న ఖర్చా? లేక కాంట్రాక్టర్ల లాభం కోసమా? ఈ నిధులు కాంట్రాక్టర్ల ఉపాధి హామీ పథకంగా మారకూడదు. ఆక్రమణలను తొలగించకుండా కట్టడాలు చేపట్టడం వల్ల ప్రయోజనం లేదు.

ముఖ్యంగా పర్యావరణం, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బొలిశెట్టి ప్రశ్నించడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, సొంత పార్టీ లైన్‌ను ధిక్కరించేలా ఆయన వ్యాఖ్యలు ఉండటంతో జనసేన అధిష్ఠానం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రకృతి ప్రసాదించిన కొల్లేరును కాపాడుకోవడానికి ప్రజా ఉద్యమం అవసరమని ఆయన పిలుపునిచ్చిన కొద్దిసేపటికే పార్టీ ఆయనతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment