జనసేన నేత, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ కొత్త వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఆయన బుల్లెట్ నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనసేన ఎంపీ వీధిలో హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయడం, మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడమేనంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్రంలో మోటార్ వాహనాల చట్టం సరైన విధంగా అమలుకు నోచుకోవడం లేదని ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలనే హైకోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేకపోతున్నారు అని ట్రాఫిక్ పోలీసులను కోర్టు ప్రశ్నించింది.
ఎంపీ ప్రవర్తనపై విమర్శలు
ప్రజా ప్రతినిధిగా ఉండే ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆయన బైక్ విన్యాసాలను ఆపకపోగా, ఎంపీ బైక్ నడుపుతున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం మరింత వివాదాస్పదమైంది. దీంతో ఓ ప్రజాప్రతినిధిగా కోర్టు ఆదేశాలను పాటిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి ఇలా బైక్‌పై సర్కస్ ఫీట్లు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.