ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు జనసేన ఎంపీ పర్సనల్ అసిస్టెంట్ కుచ్చుటోపీ పెట్టాడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి, వారి నుంచి లక్ష్లల్లో డబ్బు వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులంతా ఎంపీ ఇంటిని ముట్టడించి న్యాయం కోసం ఆందోళన చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి పీఏ గోపాల్ సింగ్ నిరుద్యోగులకు ఉద్యోగాల మాయ చూపించి కోటిన్నర రూపాయల మేర మోసం చేశాడు. పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 60 మందికి పైగా నిరుద్యోగుల వద్ద ప్రతి ఒక్కరిలోంచీ రూ.2 లక్షల చొప్పున వసూలు చేశాడు. గతంలో నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చిన గోపాల్, ఎంఎల్సీ ఎన్నికల నేపథ్యంలో వాటికి గడువు ముగిసిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
తాజాగా బాధితులను విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు రమ్మని పిలిచి, మళ్లీ కొత్తగా అపాయింట్‌మెంట్ లెటర్లు ఇస్తానని నమ్మించాడు. నిన్న హోటల్‌కి వెళ్లిన బాధితులకు గోపాల్ సింగ్ కనిపించకపోవడంతో తమను మోసగించాడని వారు స్పష్టమైంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహానికి గురైన వారు, న్యాయం కోరుతూ జనసేన ఎంపీ బాలశౌరి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేసే వ్యక్తి కాదని, తమను నమ్మించి తమ వద్ద నుంచి డబ్బులు లాగేసి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న తమను పోలీసులు బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎంపీ ఇంటి వద్ద ధర్నా చేయవద్దని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. “పార్టీకి పరువు తీసుకొచ్చే ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ న్యాయం కోసం కోరుతున్నారు.