అనకాపల్లి (Anakapalli) జిల్లా పూడిమడక తీర ప్రాంతంలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. మూడు రోజుల క్రితం సత్తయ్య (Sattaiah) అనే మత్స్యకారుడు సముద్రంలోకి వెళ్లి గల్లంతు కావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ సహచరుడి ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో బాధిత కుటుంబం కన్నీటి పర్యంతం అవుతుండగా, ప్రభుత్వ నిర్లక్ష్యంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గల్లంతైన మత్స్యకారుడి కోసం తామే స్వయంగా 20 బోట్లతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టామని పూడిమడక మత్స్యకారులు తెలిపారు. ఇంత తీవ్రమైన పరిస్థితిలోనూ ప్రభుత్వం కానీ, స్థానిక జనసేన ఎమ్మెల్యే (Jana Sena MLA) సుందరపు విజయ్ కుమార్ (Sundarapu Vijay Kumar) కానీ కనీసం స్పందించలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే ఒక్కసారి కూడా వచ్చి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం తమ వలలు భుజాన వేసుకున్న ఎమ్మెల్యే.. తమకు కష్టం వస్తే మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక అధికార యంత్రాంగం సైతం పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆరోపించారు. గల్లంతైన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు గానీ, సహాయక చర్యలు చేపట్టేందుకు గానీ ఎవరూ ముందుకు రాలేదని ఫైరవుతున్నారు. మూడు పార్టీలకు చెందిన ఒక్క నాయకుడు కూడా తమ బాధను పట్టించుకోలేదని మత్స్యకారులు వాపోయారు.
తమ జీవితం సముద్రంపై ఆధారపడి ఉందని, ప్రమాదాల సమయంలో ప్రభుత్వమే తమకు అండగా ఉండాలని గంగపుత్రులు (Gangaputras) డిమాండ్ చేస్తున్నారు. వెంటనే గల్లంతైన సత్తయ్య కోసం అధికారిక గాలింపు చర్యలు చేపట్టాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుతున్నారు. లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని పూడిమడక మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు.








