‘సీఎంకే నేరుగా ఫిర్యాదు చేసినా స్పందన లేదు’

'సీఎంకే నేరుగా ఫిర్యాదు చేసినా స్పందన లేదు'

జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన దళిత మహిళా ఉద్యోగి కేసులో పోలీసుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఎమ్మెల్యే నుంచి శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానంటూ బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం సంచలనంగా మారింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26వ తేదీన ఆమె డీజీపీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను కొట్టి, తిట్టి, బెదిరించి లైంగికంగా లోబర్చుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తనకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడని డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో స్పష్టం చేసింది.

పోలీసుల తాత్సారం.. ఎమ్మెల్యే ఒత్తిడి?
ఫిర్యాదు చేసినప్పటికీ రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి ఎస్పీ తన ఫిర్యాదును స్వీకరించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడితోనే పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించింది. డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సీఎంకు నేరుగా ఫిర్యాదు చేసిన బాధితురాలు
నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి నేరుగా తన గోడు వినిపించినట్టు బాధితురాలు వెల్లడించింది. అయినప్పటికీ తన ఫిర్యాదుపై ఎలాంటి స్పందన రాలేదని, న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమైంది.

ఒక ఎమ్మెల్యే చేతిలో బాధితురాలైన మహిళ న్యాయం కోసం సీఎంకు, డీజీపీకి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం రాష్ట్రంలో మహిళల భద్రత, చట్ట అమలుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. అధికారంలో ఉన్న నేతలపై ఫిర్యాదులు వస్తే పోలీసులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ కేసులో తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, నిష్పక్షపాత విచారణ జరపాలని, బాధిత మహిళకు పూర్తి న్యాయం చేయాలని మహిళా సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment