రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సృష్టించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే శ్రీధర్ తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ హర్షవీణ చేసిన ఆరోపణలపై తీవ్ర వ్యతిరేక రావడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా జనసేన పార్టీ అధిష్టానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవి నేడు రైల్వే కోడూరుకు చేరుకుని విచారణ చేపట్టారు.
బాధితురాలు హర్షవీణ చేసిన ఆరోపణల ప్రకారం, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని, ఐదు సార్లు అబార్షన్ చేయించుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఆమె పేర్కొంది. అంతేకాకుండా అసెంబ్లీ నుంచి కూడా వీడియో కాల్స్ ద్వారా వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపిస్తోంది.
చర్యలు తీసుకోవడంలో ఆలస్యం?
ఎమ్మెల్యేపై ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారంరోజులు గడిచినా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై చర్యలు శూన్యమని మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదని, దీనికి భిన్నంగా బాధితురాలిపైనే ఎదురు కేసులు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపింది. మహిళ ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని చెప్పినా, కేసు నమోదు చేయకుండా, కమిటీ విచారణ పేరుతో జనసేన పార్టీ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఈ వ్యవహారంపై బాధితురాలు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, డీజీపీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పందన లేదని ఆమె వాపోతోంది. ఎంతమందికి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించింది.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గలీజు వ్యవహారాలు బయటపడినా కూటమి ప్రభుత్వం ఆయనను కాపాడుతోందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ నుంచే మహిళకు వీడియో కాల్స్ చేసిన ఆరోపణలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై సీఎం చంద్రబాబు మౌనం పాటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలోనూ ఈ అంశంపై పవన్ కళ్యాణ్ నోరు విప్పకపోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా రైల్వే కోడూరులో జనసేన కమిటీ విచారణ చేపట్టడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. బాధితురాలిని బెదిరించిన వ్యక్తులతో కలిసి కమిటీ ఏర్పాటు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి ఫిర్యాదు తీసుకోకుండా పార్టీ కమిటీతో విచారణ జరపడం న్యాయసమ్మతమేనా అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.
ఇప్పటికీ బాధితురాలిని బెదిరిస్తూ తిరుగుతున్నారన్న ఆరోపణల మధ్య, ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. మహిళా భద్రతపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ “ఇదే జంగిల్ రాజా?” అంటూ ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.








