తునిలో మైనర్ బాలికపై జరిగిన దారుణమైన ఉదంతాన్ని మరువక ముందే కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో మరో అమానుష ఘటనలు చోటుచేసుకున్నాయి. వరుస ఘటనలతో ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో మైనర్ బాలికలపై అఘాయిత్యాలు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ముమ్మిడివరం నియోజకవర్గంలో 10 ఏళ్ల పసిపాపపై జనసేన పార్టీ నాయకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐ.పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన 10 ఏళ్ల ఆరవ తరగతి విద్యార్థినిపై జనసేన కార్యకర్త రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ అలియాస్ బాబీ అమానుషానికి ఒడిగట్టాడు. చాక్లెట్ ఇస్తానని నమ్మించి, బాలికను స్కూల్ సమీపంలోని భవనానికి తీసుకెళ్లి, అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బాలికను ఆ భవనం నుండి బయటకు వస్తుండగా తల్లి గమనించి ప్రశ్నించడంతో విషయం బహిర్గతమైంది. అనంతరం కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయగా, పోలీసులు POCSO చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇతను జనసేన పార్టీకి క్రియాశీలక కార్యకర్త అని, సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించిన ఫోటోలు కూడా బయటపడ్డాయి.
నెల్లూరు జిల్లాలో మరో దారుణం..
నెల్లూరు జిల్లాలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చేరిన ఓ పేషెంట్ అటెండర్ జమీర్ భాషా, 8 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన బయటపడింది. అర్ధరాత్రి సమయంలో జనరల్ వార్డులో ఈ ఘోరమైన ఘటన చోటుచేసుకోవడం ఆగ్రహానికి గురిచేస్తోంది. స్థానికులు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యం బయటపడి ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు రెండు కేసుల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. పసిపాపలపై జరిగే ఇలాంటి దారుణాలు కఠిన శిక్షలకు దారితీయాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.








