కూటమి రాజకీయాల్లో (Coalition Politics) జనసేన (Jana Sena Party) కార్యకర్తలు ఎదుర్కొనే ఇబ్బందులపై పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. “పొత్తులో (Alliance) జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు ఉంటాయి.. కొన్ని గొడవలు తప్పవు.. మెంటల్‌గా ప్రిపేర్ అవ్వండి. సీట్ల వాటాల్లో కూడా వివాదాలు రావొచ్చు. కానీ ఆ ఇబ్బందుల్లోనూ మీ లీడర్షిప్ (Leadership) ద్వారా ఎలా ఎదుగుతారు అనేదే ముఖ్యం” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ ప్రతీ వేదికపై “15 ఏళ్ల పాటు కలిసి నడవాలి” అనే మాటను చెబుతూనే ఉన్నారు. అయితే తాజాగా చేసిన ప్రసంగంతో, ఆ 15 ఏళ్ల పాటు జనసేన కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవని పవన్ ముందుగానే సంకేతాలు ఇచ్చినట్టయ్యిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే కూటమిలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతల డామినేషన్ తట్టుకోలేక కొందరు జనసేన నేతలు లబోదిబోమంటున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఏదో ఒక చోట టీడీపీ–జనసేన (TDP–Jana Sena) నేతల మధ్య ఘర్షణలు బయటపడుతూనే ఉండడం, పొత్తులో అసమతుల్యతను స్పష్టంగా చూపుతోందని జనసేన వర్గాలు అంటున్నాయి. తాజా పవన్ వ్యాఖ్యలతో చూస్తే, కూటమిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది జనసేన కార్యకర్తలే అన్న భావన బలపడుతోందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“15 ఏళ్లు టీడీపీకి కాంట్రాక్ట్ రాసిచ్చారా?” అంటూ సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధిస్తున్నారు. జనసేన జెండా మోసే కార్యకర్తలకు మాత్రమే ఇబ్బందులా? తమ రాజకీయ భవిష్యత్తును మరో పార్టీకి ఊడిగం చేయాల్సిందేనా? అన్న ప్రశ్నలు పార్టీ లోపలే చర్చకు వస్తున్నాయి. టీడీపీ నేతలు ఇబ్బందులు పెడితే చూస్తూ కూర్చోవాలా? పొత్తులో భాగంగా జనసేన పార్టీకి వచ్చేది అరకొర సీట్లే అది అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలైనా, లోకల్ బాడీ అయినా, నామినేటెడ్ పోస్టులు అయినా.. అని వీటితో సరిపెట్టుకోవాలా అంటూ జనసేన శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసిన మరో వ్యాఖ్య కూడా వివాదాస్పదంగా మారింది. “నేను ఎప్పుడూ ఒక కులం కోసం పార్టీ పెట్టలేదు. నన్ను ఒక కులానికి పరిమితం చేస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది. నేను యూనివర్సల్ థాట్‌తో వస్తే, నన్ను మాత్రం ఒక కులానికి ఆపాదిస్తారు” అంటూ పవన్ వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల సమయంలో కనీసం కుల భావనతోనైనా తనను గెలిపించాలంటూ పవన్ కోరిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పవన్ మాటలకు, అప్పటి ప్రచారానికి పొంతన లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తారో అర్థం కావడం లేదని, ఒకసారి చెప్పిన మాటకు మరోసారి చెప్పే మాటకు కనీసం పొంతన ఉండడం లేదని జనసేన నేతలు, అభిమానులు తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 15 ఏళ్ల పాటు ఇబ్బందులు భరిస్తే, తర్వాత అయినా రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? అన్న సందేహం పార్టీ శ్రేణుల్లో బలపడుతోంది. 15 ఏళ్ల పొత్తు తరువాత అయినా ఎంత మందికి అవకాశం కల్పించగలరు.. అసలు వస్తాయా.. రావా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సందర్భంలో మరో 15 ఏళ్లు అంటే తమ భవిష్యత్తును ఫణంగా పెట్టుకోలేమంటూ పక్క పార్టీల వైపు దిక్కులు చూసే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జరుగుతోంది.
మొత్తంగా పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు జనసేనలో స్పష్టత కంటే అయోమయాన్నే పెంచాయని, కూటమిలో పార్టీ పాత్ర, కార్యకర్తల భవిష్యత్తుపై మరిన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








