కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తోందని జనసేన పార్టీ (Janasena Party) కార్యకర్తలు (Activists) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అగ్రనాయకత్వం ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేస్తూ “క్రెడిట్ తీసుకోవడంలో, సెల్ఫ్ ప్రమోషన్ చేయడంలో టీడీపీని మించినవారు ఎవరూ లేరు” అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు జనసైనికులు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ప్రాజెక్టులు వస్తే వాటి ఘనత మొత్తం టీడీపీ ఖాతాలో వేసుకుంటూ, విమర్శలు వస్తే మాత్రం కూటమి మొత్తం మీద మోపుతున్నారని మండిపడుతున్నారు.
విశాఖపట్నం (Visakhapatnam)లో అదానీ (Adani) ఎయిర్‌టెల్ (Airtel) గూగుల్(Google) ఏఐ డేటా సెంటర్(AI Data Center) వ్యవహారం జనసేన క్యాడర్ (Janasena Cadre) లో మరింత అసంతృప్తిని రేపింది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను పక్కనపెట్టి చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Lokesh) ఢిల్లీ (Delhi)కి వెళ్లి డేటా సెంటర్ ఒప్పందం తమ కృషిగా చెప్పుకోవడం తగదని నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. “ఇది కూటమి ప్రభుత్వ విజయమైతే, అందరికీ క్రెడిట్ రావాలి.. కానీ తండ్రీకొడుకులు మాత్రమే తమ పేర్లు ప్రచారం చేసుకుంటున్నారు” అని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే, పరిశ్రమల స్థాపన, భూముల కేటాయింపులు వంటి ప్రభుత్వ నిర్ణయాలనూ లోకేష్ తన కృషిగా చూపించుకోవడంపై కూడా జనసేన వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. టీడీపీ సోషల్ మీడియా వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకుండానే ప్రతిదీ లోకేష్ కృషిగా ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “కూటమి అంటే సమన్వయం, కానీ ఇక్కడ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడమే లక్ష్యం అయింది” అని జనసైనికులు బాహాటంగానే వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకానికి “తల్లికి వందనం” అని పేరు మార్చి, అది లోకేష్ మదిలోని ఆలోచనగా చెప్పి చంద్రబాబు అభాసుపాలయ్యారని గుర్తుచేస్తున్నారు. ప్రతి కార్యక్రమాన్నీ లోకేష్ ఘనతగా చూపిస్తూ ఆయన నాయకత్వాన్ని ప్రజల మీద, కూటమి పార్టీల మీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని, ఈ ప్రయత్నం కూటమి భాగస్వామ్య ఆత్మను దెబ్బతీస్తోందని వారు పేర్కొంటున్నారు. లోకేష్‌ను హైలైట్ చేయడం కోసం తమ నాయకుడు పవన్ కళ్యాణ్‌ను తొక్కేస్తున్నారని జనసేన క్యాడర్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కృషికి గుర్తింపు ఇవ్వకుండా, కూటమి విజయాలను వ్యక్తిగత ప్రమోషన్‌గా మార్చడం టీడీపీకే దెబ్బకొడుతుందని జనసేన శిబిరం నుంచి గట్టి హెచ్చరికలే వినిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.








