అమెరికా ఓహియో రాష్ట్రంలోని సిన్సినాటి పట్టణంలో విజయవాడకు చెందిన యువకుడు,జనసేన పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్ల లిఖిత్ అరెస్ట్ అయ్యాడు. 15 ఏళ్ల బాలికగా నటించిన ఓ పోలీసులు అధికారి (అండర్‌కవర్ ఆఫీసర్)తో ఆన్‌లైన్‌లో లైంగిక సంభాషణ జరిపినట్లు అతనిపై ఆరోపణలు రుజువ్వడంతో అగ్రరాజ్యం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
హామిల్టన్ కౌంటీ పోలీసులు సెప్టెంబర్ 26న లిఖిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఇంపోర్ట్యూనింగ్ (Importuning), క్రిమినల్ టూల్స్ కలిగివుండటం (Possession of Criminal Tools) వంటి నేరాలు మోపారు. ప్రస్తుతం అతను $20,000 (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.17.75 లక్షలు) బాండ్‌పై రిమాండ్‌లో ఉన్నాడు.
కోర్టు వెల్లడించిన వివరాల ప్రకారం, లిఖిత్ ఆన్‌లైన్‌లో 15 ఏళ్ల బాలికగా నటించిన పోలీస్ అధికారితో సంభాషణ జరిపి, లైంగిక చర్యకు $100 చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఆ తర్వాత కలుసుకోవడానికి సమయం, ప్రదేశం నిర్ణయించుకున్నప్పుడు పోలీసులు అతన్ని పట్టుకున్నారు.
ఓహియో చట్టం ప్రకారం “ఇంపోర్ట్యూనింగ్” నేరం ఒక ఫెలనీ (Felony)గా పరిగణించబడుతుంది. అంటే మైనర్‌తో లైంగిక సంబంధం కోరడం లేదా ఆహ్వానించడం కఠినమైన నేరం. మొత్తం బాండ్ $20,000గా నిర్ణయించబడినప్పటికీ, విడుదల కావడానికి లిఖిత్ కేవలం $2,000 చెల్లించాల్సి ఉంటుంది. బైలు మంజూరైతే, కోర్టు ఆదేశాల ప్రకారం అతను ఎలక్ట్రానిక్ యాంకిల్ మానిటర్ (Electronic Ankle Monitor) ధరించాల్సి ఉంటుంది.
నల్ల లిఖిత్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్, స్ప్రింగ్‌ఫీల్డ్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, అమరావతి నుంచి బీఈ పూర్తి చేశాడు. అతని ఆన్‌లైన్ ప్రొఫైల్ ప్రకారం, అరెస్ట్ సమయంలో అతను అమెరికాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ డేటా అనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.





 



