జమ్మూ కశ్మీర్‌లో పర్యటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన దాడి తీవ్ర కలకలం రేపింది. మంగళవారం అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలోని బైసరన్ వద్ద జరిగిన ఈ దాడిలో ముగ్గురు పర్యటకులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పహల్గాం “మినీ స్విట్జర్లాండ్”గా పేరొందిన ప్రదేశం కాగా, ఆ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాల ద్వారానే చేరుకోవచ్చు.
సమీపం నుంచే కాల్పులు
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. ఉగ్రవాదులు పర్యటకులపై అత్యంత సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దాడి అనంతరం కాల్పుల శబ్దం విన్న భద్రతా దళాలు వెంటనే స్పందించి బైసరన్ ప్రాంతానికి చేరుకున్నాయి. గాయపడిన టూరిస్టులను హెలికాప్టర్ ద్వారా పహల్గాం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి 9 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు, వారి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో ఆందోళన
జూలై 3 నుంచి ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్రకు ముందు జరిగిన ఈ ఘటన భద్రతాపరంగా ఆందోళన కలిగిస్తోంది. అమర్‌నాథ్ యాత్రకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు రానున్నారు. పహల్గాం మార్గం ద్వారా ఈ యాత్రలో 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాంటి కీలక ప్రాంతంలో ఈ దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.







