జమ్మూకశ్మీర్ (Jammu & Kashmir)లో ప్రకృతి కోపం విరుచుకుపడింది. వరుసగా చోటుచేసుకున్న ప్రకృతి విపత్తులు అక్కడ విషాదాన్ని మిగిల్చాయి. రియాసి(Reasi) జిల్లా మహోర్ (Mahore) ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడి ఓ నివాస గృహం పూర్తిగా నేలమట్టమైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అదే సమయంలో, రాంబన్ జిల్లా రాజ్గఢ్ (Rajgarh)లో క్లౌడ్ బరస్ట్ (Cloud Burst) సంభవించింది. ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ఉధృతంగా దూసుకువచ్చాయి. ఇళ్లను, పంట పొలాలను ముంచెత్తిన ఈ వరదల ధాటికి ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని కనుగొనేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డిఆర్ఎఫ్ (SDRF), స్థానిక పోలీసు బృందాలు సంఘటనా స్థలాలకు చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు, నిరంతర వర్షాల కారణంగా రక్షణ చర్యలు అంతరాయానికి గురవుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలతో మొత్తం 10మంది మృతి చెందగా, గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.








