జైల్లో ప్రేమ.. పెళ్లికి 15 రోజుల పెరోల్‌.. – క్రైమ్ థ్రిల్లర్‌లా హంతకుల కథ

జైల్లో ప్రేమ.. పెళ్లికి 15 రోజుల పెరోల్‌.. - క్రైమ్ థ్రిల్లర్‌లా హంతకుల కథ

ఇద్దరూ హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. ఒకరు అత్యంత దారుణంగా తన ప్రియుడిని (Boyfriend) హత్య చేసిన మహిళ. మరొకరు ఐదుగురిని హతమార్చిన నిందితుడు. జైలు (Prison) గోడల మధ్య మొదలైన ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు వివాహానికి దారి తీసింది. పెళ్లి చేసుకునేందుకు రాజస్థాన్ హైకోర్టు నుంచి 15 రోజుల అత్యవసర పెరోల్‌ (Parole)ను కూడా పొందారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో వీరి వివాహం జరగనుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తలపించే కథలో వధువు ప్రియా సేథ్ (Priya Seth) అలియాస్ నేహా సేథ్ (Neha Seth), వరుడు హనుమాన్ ప్రసాద్ (Hanuman Prasad). ఇద్దరూ వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలి ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.

డేటింగ్ యాప్ పరిచయం.. భయంకర హత్య
మోడల్‌గా పనిచేసిన ప్రియా సేథ్, 2018లో టిండర్ డేటింగ్ యాప్ ద్వారా సింగ్ అనే యువకుడితో పరిచయం పెంచుకుంది. అతడిని ప్రేమ పేరుతో రూంకి పిలిపించి, కిడ్నాప్ నాటకం ఆడి డబ్బులు వసూలు చేయాలని ప్రణాళిక రచించింది. ఈ ప్లాన్‌లో ఆమె ప్రియుడు దీక్షాంత్ కామ్రా, మరో స్నేహితుడు లక్ష్య వాలియా కూడా భాగస్వాములు.

సింగ్ తండ్రి నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, భయంతో ఆయన రూ.3 లక్షలు చెల్లించాడు. అయితే సింగ్‌ను విడిచిపెడితే తమ నేరం బయటపడుతుందన్న భయంతో, ముగ్గురూ కలిసి అతడిని హత్య చేశారు. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి ఆమేర్ కొండల్లో పడేశారు. గుర్తు ప‌ట్ట‌కుండా ఉండేందుకు ముఖంపై కత్తిపోట్లు కూడా పొడిచారు. అయినప్పటికీ, మరుసటి రోజే పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో దోషిగా తేలిన ప్రియా సేథ్ ప్రస్తుతం సంగనేర్ ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. అక్కడే ఆరు నెలల క్రితం హనుమాన్ ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది.

ఐదుగురి హత్య.. కేసు
వరుడు హనుమాన్ ప్రసాద్ చేసిన నేరం మరింత దారుణమైనది. 2017 అక్టోబర్ 2న అల్వార్‌లో జరిగిన ఈ హత్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. తనకంటే 10 ఏళ్లు పెద్దదైన స్నేహితురాలు సంతోష్ ఆదేశాల మేరకు ఆమె భర్త బన్వరీ లాల్‌ను హత్య చేయడానికి ప్రసాద్ మరో సహచరుడితో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. వేటకొడవలి, కత్తితో బన్వరీ లాల్‌ను హత్య చేసిన తర్వాత, ఈ నేరాన్ని చూసిన సంతోష్ ముగ్గురు పిల్లలు మరియు వారితో నివసిస్తున్న మేనల్లుడు కూడా హతమార్చబడ్డారు. మొత్తం ఐదుగురిని చంపిన ఈ కేసులో హనుమాన్ ప్రసాద్‌కు జీవిత ఖైదు విధించబడింది.

జైల్లో మొదలైన ప్రేమ.. ఇప్పుడు పెళ్లి
రెండు వేర్వేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఈ ఇద్దరూ జైలులో పరిచయం పెంచుకుని పెళ్లి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నేరచరిత్ర కలిగిన ఇద్దరు ఖైదీల వివాహానికి కోర్టు పెరోల్ మంజూరు చేయడంపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రైమ్ కథలను మించిపోయే ఈ నిజ జీవిత సంఘటన, ఇప్పుడు మరోసారి ప్రజల్లో సంచలనం రేపుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment