జగిత్యాల జిల్లా కేంద్రంలో పెట్రోల్ బంకు వద్ద జరిగిన ఘర్షణలో ఆకతాయిలు పోలీసులపై ఎదురు దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. పోలీసులు అకతాయిలను అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేసినా, రాజకీయ నేతల జోక్యం కారణంగా వారిని విడిపించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల క్రితం జగిత్యాల పట్టణంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద గొడవ జరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆకతాయిలు ఇష్టారీతిన వ్యవహరిస్తుండగా వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ఆకతాయిలు ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ గొడవకు కారణమైన శేఖర్, గంగారాం అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయ జోక్యంపై విమర్శలు
ఈ అరెస్టు తర్వాత, ఓ ముఖ్య నేత రంగంలోకి దిగినట్లు సమాచారం. తన పార్టీ కార్యకర్తలను విడిపించేందుకు నేత ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు నమోదు చేసిన BNS 221, 132, 351 సెక్షన్ల కేసులపై చట్టపరమైన చర్యలు పూర్తిగా అమలు కాకుండా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చిక్కులు ఏర్పడ్డాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పినప్పటికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.