వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. ఈ 2.0 వేరే లెవెల్‌లో ఉంటుంది అంటూ వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలతో వైసీపీ కేడర్‌లో నూతన ఉత్తేజాన్ని నింపారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఉద్దేశించి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అధికారంలో ఉండగా ప్రజల కోసం ఆలోచించి, పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేకపోయి ఉండొచ్చని, ఇకపై అలా ఉండదు.. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను, కష్టాలు, బాధలను చూస్తున్నానని, అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు పెట్టిన వారితో సెల్యూట్ కొట్టిస్తానన్నారు. ఎక్కడున్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతామని కేడర్‌కు భరోసా ఇస్తూ సీఎం వ్యాఖ్యానించారు.
నా కథ గుర్తుచేసుకోండి..
రాజకీయాలలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయని, ఆ కష్టాలలో ఉన్నప్పుడు వాటిని తట్టుకొని మనం ఎలా నిలబడతామో.. ఆ పట్టుదలే మనల్ని నాయకులుగా తీర్చిదిద్దుతుందన్నారు. కష్టం వచ్చినా వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదని, ఒక్కసారి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ప్రజల్లో చులకన అవుతామన్నారు. కష్టాలు ఎల్లకాలం ఉండవు.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కథ గుర్తుకుతెచ్చుకోండి అంటూ జగన్ సూచించారు.
తనను 16 నెలలు జైల్లో పెట్టారని, తన మీద కేసులు వేసింది కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులేనని వైఎస్ జగన్ చెప్పారు. తాను రాజకీయంగా ఎదుగుతున్నానన్న కారణంతో దొంగకేసులు బనాయించి 16 నెలలు జైల్లో పెట్టారని, కానీ బయటకు వచ్చి, ప్రజల అండదండలతో ముఖ్యమంత్రి అయ్యాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.
ఆ ఇద్దరినీ గుర్తుపెట్టుకోండి..
కష్టాల్లో ఉన్నప్పుడు మంచి చేసిన వారినీ, చెడు చేసిన వారినీ ఇద్దరినీ గుర్తుపెట్టుకోవాలని, వైసీపీ బ్రతుకుతుంది.. ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది. మరో ముప్పై సంవత్సరాలు ఏలుతాం.. అనేది ఒక్కటే గుర్తు పెట్టుకోవాలని కేడర్‌కు సూచించారు. ఈసారి జగనన్న 2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా.. ఇది కచ్చితంగా చెబుతున్నానని జగన్ పునరుద్ఘాంటించారు. చంద్రబాబు వైసీపీ కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశానని, వారి బాధలను గమనించానని, కార్యకర్తల కోసం జగన్ అండగా ఉంటాడని భరోసా ఇచ్చారు.