వేలాది మంది ప్రయాణిస్తున్న రైలులో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. రైలులో తమిళనాడుకు చెందిన మహిళా ఐటీ ఉద్యోగిపై ఏపీకి చెందిన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. తమిళనాడు ఈరోడ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. మంగళవారం రాత్రి ఆమె బెంగళూరు నుంచి తన స్వస్థలం ఈరోడ్‌కు కుర్లా ఎక్స్‌ప్రెస్ రైల్లో రిజర్వ్ కంపార్ట్మెంట్‌లో ప్రయాణిస్తుంది.
ఎక్స్‌ప్రెస్ రైల్ ధర్మపురి దాటిన సమయంలో ఓ వ్యక్తి మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో షాక్‌కు గురైన యువతి కేకలు వేయగా, తోటి ప్రయాణికులు తక్షణమే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకొని దేహశుద్ధి చేశారు. బాధితురాలి నుంచి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సేలం రైల్వే స్టేషన్‌లో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
నిందితుడిని ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు చెందిన శంకర్ (45)గా గుర్తించారు. వస్త్ర వ్యాపారం కోసం ఈరోడ్‌కు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








