తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం సృష్టించాయి. టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇంటితోపాటు, వారి ఆఫీస్, కుమార్తె, సోదరుడు మరియు బంధువుల ఇళ్లలో కూడా ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు సోదాలు చేపట్టారు.
ఈ సోదాలు జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సుమారు 55 బృందాలుగా విభజించిన ఐటీ అధికారులు వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. సోదాల కారణంగా టాలీవుడ్‌లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ దాడులు సినిమా పరిశ్రమలో ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వం దృష్టి పెట్టినదానికి నిదర్శనమని భావిస్తున్నారు. సోదాల పూర్తి వివరాలు ఇంకా వెలుగు చూడాల్సి ఉంది.
అదే విధంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ సోదాలు చేపడుతున్నారు. మైత్రి మూవీస్ సంస్థ యజమానుల ఇళ్లు, ఆఫీస్‌లలో ఏక కాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు, ఆఫీసుల్లో, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప-2 సినిమా ఇటీవల భారీ కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే.








