భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో కీలక మైలురాయికి సిద్ధమైంది. 2026 సంవత్సరంలో ఇస్రో చేపడుతున్న తొలి ఆర్బిటల్ లాంచ్‌గా PSLV-C62 ప్రయోగం చేపట్టింది. ఇది PSLV రాకెట్ సిరీస్‌లో 64వ ప్రయోగం కావడం విశేషం.
ఉదయం 10:17 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉన్న ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి జరిగింది. ఈ మిషన్‌లో రెండు స్ట్రాప్-ఆన్ బూస్టర్లతో కూడిన PSLV-DL వేరియంట్ రాకెట్‌ను వినియోగిస్తున్నారు. సుమారు 260 టన్నుల బరువున్న ఈ ప్రయోగం మొత్తం రెండు గంటల పాటు కొనసాగనుంది.
ఉపగ్రహాల ద్వారా భూమిపై నిఘా
ఈ మిషన్‌లో ప్రధాన ఆకర్షణగా DRDO రూపొందించిన EOS-N1 (అన్వేషా) అనే అత్యాధునిక హైపర్‌స్పెక్ట్రల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ పర్యవేక్షణ, వ్యవసాయ రంగం, పట్టణ ప్రణాళిక, పర్యావరణ అధ్యయనాల్లో కీలక పాత్ర పోషించనుంది.
అదే సమయంలో భారత్‌తో పాటు బ్రెజిల్, నేపాల్, థాయ్‌లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, యుకే దేశాలకు చెందిన మొత్తం 15 చిన్న ఉపగ్రహాలు కూడా ఈ ప్రయోగంలో భాగమవుతున్నాయి. ముఖ్యంగా స్పెయిన్‌కు చెందిన Kestrel Initial Demonstrator శాటిలైట్ ద్వారా రీ-ఎంట్రీ టెక్నాలజీని పరీక్షించడం ఈ మిషన్‌కు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది.
ఈ ప్రయోగం విజయవంతమైతే, భారత అంతరిక్ష సామర్థ్యాలకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది.








