భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) అభివృద్ధికి బాటలు వేసిన ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ ఛైర్మన్, పద్మ విభూషణ్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (Krishnaswamy Kasturirangan) కన్నుమూశారు. ఆయన 84 ఏళ్ల వయసులో బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1994 నుండి 2003 వరకు సుదీర్ఘంగా 9 ఏళ్ల పాటు ఇస్రో ఛైర్మన్‌గా కస్తూరి రంగన్ ఆయన సేవలు అందించారు. తన హయాంలోనే భారత్ అంతరిక్ష రంగంలో గొప్ప అడుగులు వేసింది. పీఎస్ఎల్వీ (Polar Satellite Launch Vehicles) విజయవంతంగా ప్రయోగించబడిన కాలం ఇదే. జీఎస్ఎల్వీ (Geosynchronous Satellite Launch Vehicle) ప్రయోగం కూడా ఆయన ఆధ్వర్యంలోనే మొదలైంది.
INSAT ఉపగ్రహాలు, భాస్కర-1, భాస్కర-2 వంటి ప్రాజెక్టులను ఆయన పర్యవేక్షించారు. ఇక చంద్రయాన్ (Chandrayaan) ప్రణాళికకు కూడా మౌలికరూపం ఆయనే ఇచ్చారు. ఇస్రోకు ఆయన అందించిన సేవలకు గానూ కస్తూరి రంగన్‌కు భారత ప్రభుత్వం నుండి గణనీయమైన గుర్తింపులు లభించాయి. 1982లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 2000లో పద్మ విభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది.
విద్యారంగంలోనూ చెరగని ముద్ర
కేంద్రం ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (National Education Policy) ముసాయిదా కమిటీకి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ (Rajya Sabha) సభ్యుడిగా సేవలందించారు. అలాగే ప్రణాళికా సంఘం (Planning Commission) సభ్యుడిగాను, JNU ఛాన్సలర్‌గా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ – బెంగళూరు (NIAS) డైరెక్టర్‌గా సేవలందించారు.
విద్యార్హతలు, శాస్త్రీయ పరిశోధనలు
1940 అక్టోబర్ 24న కేరళ (Kerala)లోని ఎర్నాకుళం (Ernakulam)లో జన్మించిన కస్తూరి రంగన్, ముంబయి యూనివర్సిటీ (Mumbai University) నుంచి ఎంఎస్సీ (M.Sc) భౌతికశాస్త్రంలో పూర్తి చేశారు. అనంతరం హై ఎనర్జీ ఆస్ట్రోనమీలో పీహెచ్‌డీ (Ph.D) చేసి శాస్త్రద్రష్టగా నిలిచారు. అంతరిక్ష శాస్త్రంలో ఆయన పేరుతో 244కిపైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి.