ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ నిఘా సైనికురాలి వీడియో ఒకటి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో 19 ఏళ్ల లిరి అల్బాగ్ తనను హమాస్ 450 రోజులుగా బందీగా ఉంచిందని తెలిపారు. గాజా సరిహద్దు సమీపంలోని నహాల్ ఓజ్ సైనిక స్థావరంపై దాడి చేసిన సమయంలో లిరి హమాస్ చెరలోకి వెళ్లిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. లిరి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆమెను రక్షించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
బంధీల పరిస్థితిపై హెచ్చరికలు
ఇజ్రాయెల్ ప్రభుత్వం, ప్రపంచ నేతలపై ఒత్తిడి తీసుకురావడానికి హాస్టేజెస్ అండ్ మిస్సింగ్ ఫ్యామిలీస్ ఫోరం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదివరకు హమాస్ దాడిలో ప్రాణనష్టం పెద్ద ఎత్తున నమోదవగా, ఇప్పటికీ 96 మంది బంధీలుగా ఉన్నారు. పలు ఘటనల్లో మరి కొందరు మృతి చెందారు. ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉండి ఉంటారని ఇజ్రాయెల్ మీడియా వెల్లడిస్తోంది.








