4 రోజులు – 20 బిలియన్ డాలర్లు.. అగ్రరాజ్యానికి ఆయుధ గండం

4 రోజులు - 20 బిలియన్ డాలర్లు.. అగ్రరాజ్యానికి ఆయుధ గండం

ఇరాన్‌తో కొనసాగుతున్న భీకర పోరులో అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఊహించని సవాలును ఎదుర్కొంటున్నాయి. ఫిలడెల్ఫియాకు చెందిన ప్రతిష్టాత్మక ‘ఫారిన్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (FPRI) తాజా నివేదిక ప్రకారం, ఈ యుద్ధంలో వినియోగిస్తున్న ఆయుధాలు, వాటి ఖర్చు అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ దేశాలు తమ అమ్ములపొదిలోని కీలక క్షిపణులను భారీ స్థాయిలో కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది.

వేల కోట్ల రూపాయల విధ్వంసం
ఇరాన్‌-అమెరికా యుద్ధానికి సంబంధించి నివేదికలోని గణాంకాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. యుద్ధం మొదలైన మొదటి నాలుగు రోజుల్లోనే సుమారు 943 పేట్రియాట్ (Patriot) ఇంటర్‌సెప్టర్లను ప్రయోగించారు. ఒక్కో పేట్రియాట్ క్షిపణి ధర సుమారు 37 కోట్ల రూపాయలు ($4M) కాగా, వీటి మొత్తం విలువ వేల కోట్లలో ఉంటుంది. వీటిని మళ్ళీ భర్తీ చేయడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుందని అంచనా. అలాగే, ఒక్కొక్కటి రూ. 110 కోట్లు ($12M) విలువైన 145 THAAD ఇంటర్‌సెప్టర్లు, వందలాది టోమాహాక్, ATACMS క్షిపణులు శత్రు లక్ష్యాలపై ప్రయోగించారు.

తరిగిపోతున్న నిల్వలు – పెరుగుతున్న ఖర్చు
కేవలం క్షిపణుల వినియోగమే కాకుండా, అమెరికా ఆయుధ నిల్వల్లో కీలకమైన GBU-57 బంకర్ బస్టర్ బాంబులు ఇప్పటికే 25 శాతం వరకు ఖాళీ అయ్యాయి. ఒక్కొక్కటి రూ. 120 కోట్లు ($13M) విలువైన ఈ బాంబులను అత్యంత క్లిష్టమైన లక్ష్యాల కోసం వాడారు. వీటితో పాటు, నిఘా మరియు దాడులకు వాడే 11 MQ-9 రీపర్ డ్రోన్లను కూడా అమెరికా కోల్పోయింది. కేవలం ఆయుధాల భర్తీ కోసమే సుమారు రూ. 92 వేల కోట్ల నుండి రూ. 1.47 లక్షల కోట్ల వరకు ఖర్చవుతుందని, మొత్తం యుద్ధ వ్యయం రూ. 1.84 లక్షల కోట్లకు ($20B) చేరుకుందని అంచనా.

ఉత్పత్తి సామర్థ్యంపై ఆందోళన
ఆయుధాల కొరత కంటే వాటిని తిరిగి తయారు చేసే వేగం తక్కువగా ఉండటం ఇప్పుడు పెను సమస్యగా మారింది. ప్రస్తుతం నెలకు 52 పేట్రియాట్ క్షిపణులను మాత్రమే తయారు చేసే సామర్థ్యం ఉంది, కానీ, యుద్ధంలో కొన్ని రోజుల్లోనే వందల సంఖ్యలో వాడాల్సి వస్తోంది. ఇరాన్ తన డ్రోన్లు, క్షిపణులతో నిరంతరం దాడులు చేస్తూ అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ కవచాలను బలహీనపరిచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ‘యుద్ధ వ్యయం’ మరియు ‘సరఫరా’ సమస్యలు సుదీర్ఘ కాలం కొనసాగితే రక్షణ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment