ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఆరంభ వేడుకలు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్, భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ కలిసి ‘జూమే జో పఠాన్’ పాటకు డాన్స్ చేశారు. వీరి ప్రదర్శనతో స్టేడియం మొత్తం ఉత్సాహంతో మార్మోగింది.
ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్, విరాట్ కోహ్లీతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్‌తో కూడా స్టేజీపై చిట్‌చాట్ చేశారు. షారుఖ్, విరాట్‌ను నూతన తరం ఆటగాళ్ల దూకుడు గురించి ప్రశ్నించగా, కోహ్లీ స్పందిస్తూ, “నూతన తరం బలంగా వస్తోంది, కానీ పాత తరం ఇక్కడే ఉంది. మేము ఇంకా ప్రభావం చూపించడానికి సిద్ధంగా ఉన్నాం” అని అన్నారు.
ఈ ఆరంభ వేడుకలో శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, దిశా పటాని వంటి ప్రముఖులు కూడా ప్రదర్శనలు ఇచ్చారు. వీరి ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఐపీఎల్ 2025 ఆరంభ వేడుకలు సంగీతం, నృత్యాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.