గాయంతోనూ క్రీజులోనే కెప్టెన్ బావుమా: హ్యాట్సాఫ్ టెంబా!

గాయంతోనూ క్రీజులోనే కెప్టెన్ బావుమా: హ్యాట్సాఫ్ టెంబా!

ఒక జట్టు నాయకుడు ఎలా ఉండాలో తన పోరాట పటిమతో చాటి చెప్పాడు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా. లార్డ్స్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో బావుమా ఒక యోధుడిలా పోరాడుతున్నాడు. ఒకవైపు తీవ్రమైన గాయంతో బాధపడుతూనే తన జట్టును రెండో ఐసీసీ టైటిల్ విజయానికి చేరువ చేశాడు.

తన గాయం కంటే సఫారీల 27 ఏళ్ల కలనే ముఖ్యమంటూ బావుమా ముందుకు సాగుతున్నాడు. వియాన్ ముల్డర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన బావుమాకు ఆదిలోనే ఒక లైఫ్ వచ్చింది. బావుమా ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్లిప్స్‌లో స్టీవ్ స్మిత్ జారవిడిచాడు. ఆ తర్వాత టెంబా ఎడమ కాలి తొడ కండరాలు పట్టేశాయి. దీంతో ఫిజియో మైదానంలో వచ్చి చికిత్స అందించాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరుగుతాడని అంతా భావించారు. కానీ బావుమా మాత్రం జట్టు విజయమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వికెట్ల మధ్య కుంటుతూనే పరుగుల కోసం కదిలాడు. నొప్పిని భరిస్తూనే అవతలి ఎండ్‌లో సెంచరీ హీరో మార్‌క్ర‌మ్‌కు అండగా నిలిచాడు.

సెంచరీ హీరో ఐడెన్ మార్‌క్ర‌మ్ (102 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు 143 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో బావుమా పోరాట పటిమపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “బావుమా ది వారియర్” అంటూ పోస్టులు పెడుతున్నారు. బావుమా ప్రస్తుతం 65 పరుగులతో బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ విజయానికి కేవలం 69 పరుగుల దూరంలో నిలిచింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అంతకుముందు, ఓవర్‌నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (136 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment