భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. గడచిన మూడు రోజుల్లో రెండు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షల లడ్డూలను విక్రయించారు. దీక్షల విరమణకు సంబంధించి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో..
సోమవారం ఒక్కరోజు మాత్రమే 63,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కూడా భవానీ దీక్షాధారులు ఇంద్రకీలాద్రిని సందర్శిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో అన్నదాన కార్యక్రమాలు, లడ్డూల తయారీ వంటి ఏర్పాట్లు మరింత పెంచినట్లు అధికారులు తెలిపారు.
భవానీ దీక్షల విరమణల పురస్కరించుకొని భక్తులందరికీ దర్శనం ఉచితమని, అంతరాలయం, దర్శన టిక్కెట్లు ఉండవని, ఆర్జిత సేవలు నిలుపుదల చేసిన్నట్లు ఆలయ ఈవో తెలిపారు. అన్ని లైన్‌లు ఉచితమని, ఉదయం 3 నుండి రాత్రి 11 గం. ల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చని వివరించారు.








