హైదరాబాద్ (Hyderabad)లోని పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రేవంత్ ప్రభుత్వం ‘ఇందిరా క్యాంటీన్’ (Indira Canteen) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద కేవలం రూ. 5కే అల్పాహారం, రూ. 5కే మధ్యాహ్న భోజనం అందిస్తారు. మొదటి దశలో మోతీనగర్, మింట్ కాంపౌండ్ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల్లో ఒకటని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం వంటి పథకాలను అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
అంతేకాకుండా, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వంటి ప్రణాళికలు ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ క్యాంటీన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.







