ఇండిగో విమానాల సంక్షోభం.. ఢిల్లీకి రూ.1,000 కోట్ల నష్టం

ఇండిగో విమానాల సంక్షోభం.. ఢిల్లీకి రూ.1,000 కోట్ల నష్టం

ఇండిగో విమానయాన (IndiGo Airlines) సంస్థలో వరుసగా పదో రోజు కూడా వందలాది విమానాలు రద్దు (Flights Cancellation), డిలే (Delay) స‌మ‌స్య‌తో ఢిల్లీ (Delhi) ఆర్థిక వ్యవస్థ (Economy) తీవ్రంగా దెబ్బతింది. విమానాల రద్దు కారణంగా వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలలో గణనీయమైన నష్టం సంభవించిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) వెల్లడించింది. ఈ సంక్షోభం వల్ల మొత్తం ఢిల్లీకి దాదాపు రూ.1,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేసింది.

విమానాల రాకపోకల్లో ఆటంకం ఏర్పడటంతో వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్ ట్రావెలర్లు ఢిల్లీకి రావడం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా నగరంలోని టోకు మార్కెట్లు, రిటైల్ సెంటర్లు భారీ నష్టాన్ని ఎదుర్కొన్నట్లు CTI చైర్మన్ బ్రిజేశ్ గోయల్ (Brijesh Goyal – CTI Chairman) తెలిపారు.

సాధారణంగా ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) ద్వారా రోజుకు 1.5 లక్షల మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తారు. అందులో 50 వేల మంది వ్యాపారులు, బిజినెస్ ట్రావెలర్లు ఉంటారు. ఇండిగో విమానాల రద్దుతో ఈ వర్గం రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. గత పదిరోజుల్లో మార్కెట్లలో జనసంచారం 25% వరకు తగ్గిందని CTI నివేదించింది.

విమానాల రద్దు ప్రభావం పర్యాటక రంగంపై గట్టిగా పడింది. గత వారం రోజులలో హోటళ్లు, రిసార్ట్‌లు, రెస్టారెంట్లలో వేలాది బుకింగ్‌లు రద్దయ్యాయి. ప్రగతి మైదాన్, ఆనంద్ మండపం వంటి కేంద్రాల్లో జరుగుతున్న ఆటోమొబైల్ ప్రదర్శనలు, చేనేత–వస్త్ర ఎగ్జిబిషన్లు, గృహోపకరణాల ఈవెంట్లు జ‌నం లేమితో తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్‌లో సాధారణంగా పర్యాటక రద్దీ అధికం ఉండే సమయంలోనే ఈ సంక్షోభం ఏర్పడటంతో హోటల్ పరిశ్రమ పెద్ద నష్టాన్ని చవిచూసింది.

డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు హాజరుకావాల్సిన వారు విమానాలు రద్దు కావడంతో చేరుకోలేకపోవడం వల్ల హోటళ్లకు, క్యాటరింగ్ రంగానికి గణనీయమైన నష్టం జరిగింది. ఇండిగో విమానాల రద్దు ప్రభావం కేవలం సంస్థ వరకు మాత్రమే కాక, ఢిల్లీని వాణిజ్య కేంద్రంగా ఉపయోగించే దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార వ్యవస్థపై పరోక్ష ప్రభావం చూపుతోంది.

ఇతర నగరాల నుంచి వ్యాపారులు, సందర్శకులు ఢిల్లీకి రాలేకపోవడంతో ఎగ్జిబిషన్లు, వ్యాపార సమావేశాలు, ఒప్పందాలు ఆలస్యం కావడం నిపుణులను కలవరపెడుతోంది. దేశీయ విమానయాన వ్యవస్థలో ఏర్పడిన ఈ సంక్షోభం ఇంకా కొనసాగితే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment