ఇండిగో ఫ్లైట్‌ల గందరగోళం.. ఒక్కరోజులో 400కి పైగా రద్దు

ఇండిగో ఫ్లైట్‌ల గందరగోళం.. ఒక్కరోజులో 400కి పైగా రద్దు

ఇండియా అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ పెద్ద‌ఎత్తున విమానాలు రద్దు చేయడం దేశవ్యాప్తంగా ప్రయాణికుల్లో ఆందోళనకు కారణమైంది. గత రెండు రోజులుగా ఆలస్యాల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, శుక్రవారం పరిస్థితి మరింత ప్రతికూలంగా మారింది. సాంకేతిక, ఆపరేషనల్ సమస్యలు పెరగడంతో ఒక్కరోజులోనే 400కి పైగా ఫ్లైట్‌లు రద్దు చేసినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.

ప్రధాన నగరాల్లో భారీగా
ఇండిగో ఫ్లైట్ రద్దుల ప్రభావం దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాలపై తీవ్రంగా పడింది. అనేక మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే గంటల తరబడి ఇరుక్కుపోయారు. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఇండిగో ఢిల్లీ విమానాశ్రయంలో త‌న సంస్థ‌ ఫ్లైట్లు రద్దు చేశారు. అర్ధరాత్రి వరకు ఫ్లైట్ల రద్దు కొన‌సాగ‌నుంది. ఢిల్లీ నుంచి వెళ్లే దాదాపు 400 ఇండిగో ఫ్లైట్లు రద్దు చేసిన‌ట్లుగా స‌మాచారం. అదే విధంగా ముంబైలో 100 ఫ్లైట్లు రద్దు చేశారు. నిన్న ఒక్క‌రోజే దేశంలోని మేజర్ ఎయిర్‌పోర్టుల‌లో 550 ఫ్లైట్లను రద్దు చేసింది ఇండిగో సంస్థ‌. ఇండిగో సంస్థ దేశంలో ప్రతిరోజు 2300 డొమెస్టిక్ ఫ్లైట్లు నడుపుతుంది. ఫ్లైట్ల ర‌ద్దుతో బిజినెస్ ట్రావెలర్స్, వైద్య ప్రయాణికులు, విదేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్‌లు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

“ఇది మోనోపోలీల గేమ్” – రాహుల్ గాంధీ విమర్శలు
ఈ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత, ఎంపీ రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో గందరగోళం ప్రభుత్వ అనుకూల ఏకాధిపత్య విధానాల ఫలితమని వ్యాఖ్యానించారు.“ఇండిగోలో ఉన్న గందరగోళం ప్రభుత్వ మోనోపోలీ సంస్కృతికి నిదర్శనం. ఫ్లైట్‌లు రద్దు, ఆలస్యం వల్ల ఇబ్బందులు పడేది సామాన్య ప్రజలే. భారత్‌కు నిజమైన పోటీ అవసరం. కాకపోతే మ్యాచ్ ఫిక్సింగ్ చేసే ఏకాధిపత్య వ్యాపారాలు కాదు” అని రాహుల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment