విమానయానంలో ఇండిగో, ఎయిర్‌ఇండియా ఆధిపత్యం!

విమానయానంలో ఇండిగో, ఎయిర్‌ఇండియా ఆధిపత్యం!

భారతదేశంలోని మొత్తం విమానయాన రంగం పూర్తిగా రెండు పెద్ద సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా ఆధీనంలోకి వెళ్లిపోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు మార్కెట్‌ను తమ చేతుల్లోకి తీసుకోవడంతో పోటీ తగ్గిపోయి, సేవల నాణ్యతలో తీవ్ర వైఫల్యాలు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. గత ఐదు రోజులుగా దేశంలోని ముఖ్య విమానాశ్రయాలు సాధారణ రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్ల కంటే కూడా అధ్వానకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని ఎద్దేవా చేశారు.

శ్రమ దోపిడిని అరికట్టేందుకు పైలట్ల పనిగంటలను పరిమితం చేసే కొత్త నిబంధనను డీజీసీఏ ప్రవేశపెట్టిందని, పైలట్లు వారానికి ఒక నిర్దిష్ట సమయం కంటే ఎక్కువ పని చేయకూడదని ఆ రూల్‌లో స్పష్టం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే, ఇండిగో కంపెనీ ఆ నిబంధనను పాటించకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. పైలట్ల కొరత, షెడ్యూల్ అస్త‌వ్య‌స్త విధానంతో ఇండిగో కార్యకలాపాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయని చెప్పారు.

దీంతో నిన్న ఒక్కరోజే ఇండిగోకు చెందిన దాదాపు 1000 విమానాలు రద్దు కావాల్సి వచ్చిందని, దేశంలోని ముఖ్య నగరాల ఎయిర్‌పోర్ట్‌లన్నీ వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయన్నారు. టెర్మినల్స్‌ అన్నీ గందరగోళంతో నిండిపోయి, ప్రయాణికులు గంటల తరబడి ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. విమానయాన రంగంలో ఇంత పెద్ద స్థాయి కుప్పకూలింపు ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగలేదని కేటీఆర్ అన్నారు. ఇండిగో–ఎయిర్ ఇండియా ఆధిపత్యం, నియంత్రణ లేమి వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని కేటీఆర్‌ అన్నారు. కొంతమంది చేతుల్లో ఆధిప‌త్యం దేశ ఆర్థిక వ్యవస్థకే ముప్పని, విమానయాన రంగం తాజా ఉదాహరణగా నిలిచిందని కేటీఆర్ అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment