టీమిండియా (Team India) వికెట్ కీపర్ (Wicket Keeper) బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అద్భుతంగా దూసుకుపోతున్నాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ (Rankings)లో ఒక స్థానం మెరుగుపరుచుకుని ఆరో ప్లేస్‌కు చేరుకున్నాడు. లీడ్స్ వేదికగా (Leeds Venue) ఇంగ్లండ్ (England)తో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు (ట్విన్ సెంచరీస్) సాధించిన పంత్, గత వారం ర్యాంకింగ్స్‌లోనే ఒక ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. ఇప్పుడు మరో ర్యాంక్ ఎగబాకి, తన కెరీర్ అత్యుత్తమమైన ఐదో ర్యాంక్‌కు అత్యంత చేరువయ్యాడు.
800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్‌కీపర్!
గత వారం ర్యాంకింగ్స్ తర్వాత పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్‌కీపర్ బ్యాటర్ కూడా 800 రేటింగ్ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్‌కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)కి కూడా ఇది సాధ్యపడలేదు. ప్రస్తుతం పంత్ 801 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతున్నాడు.
నెక్స్ట్ టార్గెట్ నంబర్ వన్ ర్యాంక్!
ఇంగ్లండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పంత్ ఇదే జోరును కొనసాగిస్తే, త్వరలోనే నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం టాప్ ర్యాంక్‌లో ఉన్న జో రూట్‌కు పంత్‌కు మధ్య 88 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది. పంత్ తర్వాతి టార్గెట్ స్టీవ్ స్మిత్. స్మిత్ తాజా ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో ఉన్నారు.
ఇతర ర్యాంకింగ్స్‌లో మార్పులు
ఈ వారం ర్యాంకింగ్స్‌లో పంత్‌తో పాటు మరిన్ని చెప్పుకోదగ్గ మార్పులు జరిగాయి.
బ్యాటర్లు: ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ 3 స్థానాలు (10వ స్థానానికి), శ్రీలంక ఓపెనర్ పథుమ్ నిస్సంక 14 స్థానాలు (17వ స్థానానికి), ఆసీస్ ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ 11 స్థానాలు (53వ స్థానానికి), సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ డెయాన్ డ్రేనెర్ 17 స్థానాలు (56వ స్థానానికి), మరో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ 15 స్థానాలు (59వ స్థానానికి), వెస్టిండీస్ ప్లేయర్ జస్టిన్ గ్రీవ్స్ 15 స్థానాలు (86వ స్థానానికి) మెరుగుపరుచుకున్నారు.
బౌలర్లు: బుమ్రా, రబాడ, కమిన్స్ టాప్-3లో కొనసాగుతుండగా, విండీస్ పేసర్ షమార్ జోసెఫ్ 14 స్థానాలు (36వ స్థానానికి), ముల్డర్ 6 స్థానాలు (52వ స్థానానికి), కార్బిన్ బాష్ 45 స్థానాలు (57వ స్థానానికి), చివంగా 35 స్థానాలు (88వ స్థానానికి) మెరుగుపరుచుకున్నారు.
ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, మెహిది హసన్, జన్సెన్ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.