భారత (India) మహిళా క్రికెట్ (Women’s Cricket) జట్టు ఇంగ్లాండ్ (England) గడ్డపై అపూర్వ విజయాన్ని నమోదు చేసింది. 2012 నుంచి ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్‌లు ఆడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా సిరీస్‌ను గెలవలేకపోయిన టీమిండియా, ఈసారి 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
జులై 9 (బుధవారం)న మాంచెస్టర్ (Manchester)లో జరిగిన నాల్గో టీ20లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ (Radha Yadav) (4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు) కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ (Player Of The Match) అవార్డును అందుకుంది. శ్రీఛరణి కూడా 2 వికెట్లు పడగొట్టింది.
127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన (32), షఫాలీ వర్మ (31) శుభారంభం ఇవ్వగా, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (26), జెమీమా రోడ్రిగ్స్ (24 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. షఫాలీ వర్మకు ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అవార్డు దక్కింది.
ఈ చారిత్రక విజయంతో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌లో తమ తొలి టీ20 సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. గత నాలుగు సిరీస్‌లలో మూడుసార్లు ఇంగ్లాండ్ గెలువగా, ఈసారి భారత జెండా రెపరెపలాడింది. చివరి నామమాత్రపు టీ20 మ్యాచ్ జులై 12న జరగనుంది.