భారత స్పేస్ స్టేషన్ (Space Station) కోసం అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, అందుకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. ఈ కొత్త ప్రాజెక్టు కోసం శరవేగంగా కార్యాచరణ సాగుతుందని ఆయన చెప్పారు. ఇస్రో చీఫ్ వి. నారాయణన్ మాట్లాడుతూ.. స్పేడెక్స్ మిషన్‌ను డిసెంబర్ 30న ప్రారంభించారు. స్పేడెక్స్ శాటిలైట్ డాకింగ్ జనవరి 9న జరగనుంది. గగన్‌యాన్ ప్రోగ్రామ్ ఇస్రోకు పెద్ద ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా కొనసాగుతోంది. జీఎస్ఎల్వీ ద్వారా ఎన్వీఎస్ 02 నావిగేషన్ శాటిలైట్‌ను ప్రయోగించేందుకు శ్రీహరికోటలో వర్క్ కొనసాగుతోంది. చంద్రయాన్ 3 దక్షిణ చంద్రుడిపై ల్యాండ్ అవ్వడంతో, చంద్రయాన్ 4 ప్రాజెక్టు ద్వారా శ్యాంపిళ్ల సేకరణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఆయన చెప్పారు.
భారత స్పేస్ స్టేషన్.. 2028లో ప్రారంభం
భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు ముఖ్యమైన గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే అందుకున్నామని ఇస్రో చీఫ్ తెలిపారు. 2028లో మొదటి మాడ్యూల్‌ను లాంచ్ చేయనున్నట్లు చెప్పారు. భారత స్పేస్ స్టేషన్ 5 మాడ్యూళ్లతో ఉంటుందని ఇస్రో చీఫ్ నారాయణన్ తెలిపారు.