అమెరికా (America) అధ్యక్షుడు (President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సుంకాల (Tariff) బెదిరింపులను లెక్క చేయకుండా, రష్యా (Russia) నుంచి చమురు కొనుగోలును భారత్(India) కొనసాగిస్తుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) చైర్మన్ ఎఎస్ సాహ్నీ (A.S.Sahni) స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు అనేది పూర్తిగా ఆర్థిక అంశాల ఆధారంగానే జరుగుతుందని ఆయన తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఎటువంటి నిషేధం లేదని, అందువల్ల కొనుగోళ్లను కొనసాగిస్తామని ఆయన అన్నారు.
కొనుగోళ్లు కొనసాగుతాయి..
జూలై నెలలో మరియు ఈ నెలలో కూడా రష్యన్ చమురు భారత శుద్ధి కర్మాగారాలకు చేరుకుంటుందని సాహ్నీ పేర్కొన్నారు. ధర, నాణ్యత, మరియు తమ ప్రాసెసింగ్ ప్లాన్లకు అనుకూలంగా ఉంటే, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తామని తెలిపారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో, IOC శుద్ధి కర్మాగారాలు ఉపయోగించిన ముడి చమురులో రష్యా వాటా 22-23 శాతంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని, భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.








