అండర్–19 వరల్డ్ కప్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్!

అండర్–19 వరల్డ్ కప్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్!

అండర్–19 వరల్డ్ కప్ అంటేనే టీమిండియా ఆధిపత్యానికి మరో పేరు. 16 సార్లు టోర్నీలో పాల్గొని, 10 సార్లు ఫైనల్ చేరి, 6 సార్లు ట్రోఫీని ముద్దాడిన ఘనత భారత కుర్రాళ్ల సొంతం. 1988లో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో 2000లో మహ్మద్ కైఫ్ సారథ్యంలో తొలి టైటిల్ గెలిచిన భారత్.. 2026లో ఆరోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

లీగ్ దశ నుంచి ఒక్క ఓటమి లేకుండా ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా, టైటిల్ పోరులోనూ అదే జోరు కొనసాగించింది. హోరాహోరీగా ఉంటుందని భావించిన ఫైనల్ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చి, ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

సూర్యవంశీ వన్‌మ్యాన్ షో
ఈ చారిత్రక విజయంలో హీరో ఒక్కరే… వైభవ్ సూర్యవంశీ. ఫైనల్ మ్యాచ్‌లో అతడు చూపించిన బ్యాటింగ్ విధ్వంసం క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అండర్–19 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచాడు. వైభవ్‌కు కెప్టెన్ ఆయుష్ మాత్రే (53), అభిగ్యాన్ కుండు (40) చక్కటి సహకారం అందించారు. ముఖ్యంగా రెండో వికెట్‌కు వైభవ్–మాత్రే జోడీ 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, మ్యాచ్‌ను భారత్ వైపుకు తిప్పింది.

రికార్డుల మోత.. పరుగుల సునామీ
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫ్లాట్ పిచ్‌పై వైభవ్ సూర్యవంశీ పవర్ హిట్టింగ్‌తో ఇంగ్లండ్ బౌలింగ్‌ను చీల్చిచెండాడు. కేవలం 32 బంతుల్లో అర్ధ సెంచరీ, 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అతడు.. 71 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. గ్రౌండ్ నలుమూలలా భారీ సిక్సర్లు, కవర్ డ్రైవ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ (37 నాటౌట్) కీలక పరుగులు జోడించడంతో భారత్ 400 మార్క్ దాటింది. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3 వికెట్లు పడగొట్టాడు.

ఫాల్కనర్ పోరాటం వృథా
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం లభించినప్పటికీ, భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. కాలెబ్ ఫాల్కనర్ 63 బంతుల్లో సెంచరీ (115) చేసి పోరాడినా, ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం లభించలేదు. 40.2 ఓవర్లలో 311 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో, భారత్‌కు 100 పరుగుల తేడాతో ఘన విజయం లభించింది. భారత బౌలర్లలో అంబరీష్ 3 వికెట్లు, దేవేంద్రన్, కనిష్క్ చెరో రెండు వికెట్లు తీశారు.

అవార్డుల వరద
ఈ మెగా విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు లభించాయి. ఆరోసారి అండర్–19 వరల్డ్ కప్ గెలుచుకున్న భారత్… మరోసారి ప్రపంచ క్రికెట్‌లో తన అసాధారణ ప్రతిభను నిరూపించింది. భారత యువ క్రికెట్ భవిష్యత్ ఎంత వెలుగుతో నిండిందో ఈ విజయం స్పష్టంగా చాటింది.

Join WhatsApp

Join Now

Leave a Comment