న్యూజిలాండ్ (New Zealand)తో సొంతగడ్డపై వన్డే సిరీస్‌ను కోల్పోయిన నిరాశను టీమిండియా (Team India) టి20ల్లో ఘనంగా తుడిచేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మూడో టి20లో (T20s) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ 8 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించి, 3–0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చాప్మన్ (32), కెప్టెన్ సాంట్నర్ (27) చివర్లో వేగం పెంచారు. భారత బౌలింగ్‌లో ప్రపంచకప్‌కు ముందు జస్ప్రీత్ బుమ్రా తన క్లాస్ చూపించాడు. కేవలం 17 పరుగులకే 3 వికెట్లు తీసి కివీస్ ఇన్నింగ్స్‌కు బ్రేక్ వేశాడు. హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీశారు.
10 ఓవర్లలోనే లక్ష్యం ఛేదన
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటింగ్ తుపాను సృష్టించింది. కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) (20 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) (26 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) బౌలర్లపై విరుచుకుపడ్డారు. వారి ధనాధన్ షాట్లతో స్టేడియం ఉర్రూతలూగింది.
14 బంతుల్లో ఫిఫ్టీ!
మ్యాచ్ ఆరంభంలో తొలి బంతికే సంజూ సామ్సన్ క్లీన్‌బౌల్డ్ కావడంతో కివీస్ శిబిరం ఒక్కసారిగా ఉత్సాహపడింది. కానీ అది క్షణకాలమే! ఆ వెంటనే ఇషాన్ కిషన్ (28) సిక్స్‌తో దూకుడు మొదలుపెట్టగా, అసలైన విధ్వంసం అభిషేక్, సూర్యకుమార్ రూపంలో కనిపించింది. అభిషేక్ కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి రికార్డు వేగంతో రాణించాడు. సూర్యకుమార్ 25 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. మూడో వికెట్‌కు ఈ జోడీ కేవలం 40 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. భారత్ 3.1 ఓవర్లలోనే 50 పరుగులు, 6.3 ఓవర్లలో వంద పరుగులు దాటింది. 9.5 ఓవర్లలో 150ని అధిగమించి మ్యాచ్‌ను ముగించింది.
బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’
అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చిన జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సిరీస్‌లో నాలుగో టి20 మ్యాచ్ బుధవారం విశాఖపట్నంలో జరగనుంది.







