నేడు భారత్–న్యూజిలాండ్ ఫైనల్ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు ఇవే!

టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup Final 2026) ఫైనల్ మ్యాచ్ (Final Match) నేడు జరగనుంది. భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్లు అహ్మదాబాద్‌లోని (Ahmedabad) నరేంద్ర మోడీ స్టేడియంలో (Narendra Modi Stadium) తలపడబోతున్నాయి. ఈ కీలక పోరు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఐసీసీ టోర్నీల్లో భారత్‌కు ఎప్పుడూ గట్టి సవాల్‌గా నిలిచే న్యూజిలాండ్‌ను ఈసారి సొంత గడ్డపై ఎదుర్కొంటోంది టీమిండియా.

అహ్మదాబాద్ వేదిక భారత అభిమానులకు కొన్ని చేదు జ్ఞాపకాలను గుర్తుచేస్తుండటంతో అభిమానుల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు న్యూజిలాండ్‌పై భారత్ ఒక్కసారైనా గెలవకపోవడం గమనార్హం. అయినప్పటికీ సూర్యకుమార్ (Suryakumar Yadav) నాయకత్వంలోని భారత జట్టు ఈసారి చరిత్రను మార్చాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

తుది జట్టులో మార్పు చేసే అవకాశం
ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఎక్కువ పరుగులు ఇస్తున్న వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్‌దీప్ యాదవ్‌కు అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమైనా మరో అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.

సంజు, ఇషాన్, తిలక్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, దూబేలు మంచి ఫామ్‌లో ఉండడం భారత్‌కు పెద్ద బలం. అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా బౌలింగ్‌లో మరోసారి మెరుగ్గా రాణిస్తే భారత జట్టుకు విజయం దగ్గర కావచ్చు.

మరోవైపు న్యూజిలాండ్ జట్టూ సమతూకంగా కనిపిస్తోంది. అలెన్, సీఫర్ట్ జట్టుకు మంచి ఆరంభాలు అందిస్తున్నారు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్‌లతో వారి బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. శాంట్నర్ నాయకత్వంలో హెన్రీ, ఫెర్గూసన్ వంటి పేసర్లు కూడా ప్రమాదకరంగా ఉన్నారు. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగనుంది.

హెడ్ టు హెడ్ రికార్డులు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు మూడు సార్లు తలపడ్డాయి. 2007, 2016, 2021లో జరిగిన ఆ మూడు మ్యాచ్‌ల్లో కూడా భారత్ ఓడిపోయింది.

అయితే మొత్తం అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు 30 సార్లు తలపడ్డాయి. అందులో భారత్ 16 మ్యాచ్‌లు గెలిచింది. న్యూజిలాండ్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి.

పిచ్ రిపోర్ట్
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్‌ను ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి మిశ్రమంతో తయారు చేశారు. ఈ పిచ్‌లో పేస్, బౌన్స్ ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పెద్ద స్కోర్లు నమోదయ్యే అవకాశమూ కనిపిస్తోంది. స్పిన్నర్లకు పెద్దగా సహకారం ఉండకపోవచ్చని అంచనా.

గత ఎనిమిది మ్యాచ్‌లలో ఐదు సార్లు లక్ష్యాన్ని ఛేజ్ చేసిన జట్టే గెలిచింది. అందువల్ల టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ వర్షం కారణంగా ఆదివారం మ్యాచ్ పూర్తికాకపోతే సోమవారం రిజర్వ్ డేగా మ్యాచ్ నిర్వహిస్తారు.

తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, సంజు సామ్‌సన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి / కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్: సీఫర్ట్, అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, చాప్‌మన్, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మెకాంకీ, నీషమ్ / డఫీ, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్.

Join WhatsApp

Join Now

Leave a Comment