2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా జట్టు సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి, చరిత్ర సృష్టించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో జెమీమా రోడ్రిగ్స్ (127 నాటౌట్) సెంచరీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (89) కీలక పాత్ర పోషించారు. ఆదివారం జరిగే ఫైనల్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈసారి విజేతగా నిలిచే జట్టు కొత్త ప్రపంచకప్ ఛాంపియన్‌గా అవతరించనుంది.
ఫైనల్‌కు చేరడం ద్వారా భారత జట్టు ఇప్పటికే భారీ ప్రైజ్‌మనీని ఖాయం చేసుకుంది. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 20 కోట్లు దక్కుతాయి. ఒకవేళ ప్రపంచకప్‌ను గెలిస్తే, టీమిండియా ఏకంగా రూ. 40 కోట్ల భారీ బహుమతిని అందుకుంటుంది. ఈసారి ఐసీసీ పురుషులు, మహిళల క్రికెట్ ప్రైజ్‌మనీని పూర్తిగా సమానం చేసింది. 2022 నాటి ఎడిషన్‌తో పోలిస్తే, ఈసారి ప్రైజ్‌మనీలో ఏకంగా 297 శాతం పెరుగుదల ఉండటం విశేషం.
ఈ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ఐసీసీ మొత్తం ప్రైజ్‌మనీని రూ. 116 కోట్లు గా నిర్ణయించింది. విజేతకు రూ. 40 కోట్లు, రన్నరప్‌కు రూ. 20 కోట్లు దక్కుతాయి. సెమీఫైనల్‌లో ఓడిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు చెరో రూ. 9.9 కోట్లు అందుకుంటాయి. గ్రూప్ దశలో పాల్గొన్న ప్రతి జట్టుకు రూ. 2.2 కోట్లు బహుమతిగా ఇస్తారు. అదనంగా, గెలిచిన ప్రతి గ్రూప్ మ్యాచ్‌కు సుమారు రూ. 28.8 లక్షలు లభిస్తాయి.





 



