“గుర్తులేదు.. మరిచిపోయా”.. ఐబొమ్మ ర‌వి కేసులో కీల‌క ప‌రిణామం

“గుర్తులేదు.. మరిచిపోయా”.. ఐబొమ్మ ర‌వి కేసులో కీల‌క ప‌రిణామం

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఐబొమ్మ నిర్వాహ‌కుడు ఇమ్మిడి ర‌వి (ImmadI Ravi) కేసు త‌వ్వే కొద్దీ కొత్త మ‌లుపులు తిరుగుతూనే ఉంది. గ‌త రెండ్రోజులుగా పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రించాడు. మూడో రోజు విచార‌ణ‌లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకమైన మూడో రోజు విచారణను స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Police Commissioner) సజ్జనార్ (Sajjanar) పరిశీలించారు. సైబర్ క్రైమ్ కార్యాలయానికి (Cyber Crime Office) చేరుకున్న సీపీ, రవిని ప్రత్యక్షంగా ప్రశ్నించారు. అయితే విచారణకు రవి పూర్తిగా సహకరించడం లేదు. అడిగిన ప్రశ్నలకు గందరగోళమైన, పొంతనలేని సమాధానాలు ఇస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లు కోరినా “గుర్తులేదు… మరిచిపోయాను” అంటూ సమాధానాలు ఇస్తున్న రవి వల్ల సైబర్ క్రైమ్ బృందం ఇబ్బంది పడుతోంది. దీంతో హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లను ఎథికల్ హ్యాకర్ల సాయంతో విప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఐబొమ్మ వ్యవస్థకు భారత్‌లో కాకుండా ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లో ప్రధాన సర్వర్లు ఉన్నట్టు దర్యాప్తులో బయటపడింది. బ్యాంక్ ఖాతాల వివరాలు అడిగితే కూడా రవి నోరు విప్పకపోవడంతో, రవి అకౌంట్ల పూర్తి వివరాలు ఇవ్వాలని పలు బ్యాంకులకు పోలీసులు ఇప్పటికే మెయిల్స్‌ పంపారు.

ఇమ్మడి రవి గత కొద్దికాలంగా తరచుగా విదేశాలకు వెళ్లిన విషయం దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రతి 20 రోజులకు ఒకసారి కొత్త దేశానికి ప్రయాణం చేసినట్లు ప్రయాణ రికార్డులు చెబుతున్నాయి. అయితే దీనిపై రవిని అడిగితే “విదేశీ పర్యటనలు అంటే ఇష్టం… అలా వెళ్తుండేవాడిని” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. రవి వెళ్లిన దేశాల్లో ఉన్న పైరసీ లింకులు (Piracy Links), సంబంధిత హోస్టింగ్ నెట్‌వర్క్‌ (Hosting Networks)ల కూపీలు ఇప్పుడు పోలీసులు లాగుతున్నారు.

సర్వర్లు, విదేశీ పర్యటనలు, డిజిటల్ సాక్ష్యాలు అన్నీ కలిపి ఐబొమ్మ వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న నెట్‌వర్క్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. రవి సహకరించకపోయినా, డిజిటల్ ఫారెన్సిక్ టీమ్ సేకరిస్తున్న ఆధారాలు కేసు దిశను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటితో కస్టడీ ముగిసే నేపథ్యంలో, తదుపరి నిర్ణయంపై పోలీసుల దృష్టి నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment