తెలుగు సినిమా పైరసీకి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు, ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ i-BOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్రాన్స్ నుండి హైదరాబాద్‌కి వచ్చిన వెంటనే అతడి కదలికలను గమనించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా కరేబియన్ దీవుల్లో తలదాచుకుని i-BOMMA వెబ్‌సైట్‌ను నడుపుతున్న ఇమ్మడి రవి, అక్కడి నుంచే తెలుగు సినిమాలు, OTT కంటెంట్ పైరసీ చేస్తున్నట్లు సమాచారం.
తెలుగు సినీ నిర్మాతల పలు ఫిర్యాదుల ఆధారంగా ఈ కేసును సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై చర్య తీసుకోమని నిర్మాతల మండలి కూడా ఒత్తిడి చేయడంతో పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో విచారణ చేసేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గతంలో దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసరడంతో, ఈ కేసుపై మరింత ఫోకస్ పెట్టి, ఇండియా వచ్చిన ఇమ్మిడి రవిని పోలీసులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు.
అరెస్టు తర్వాత కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, i-BOMMA సర్వర్ల లాగిన్ వివరాలు కూడా రవి నుంచి తీసుకుని, వెబ్‌సైట్‌లో ఉన్న పైరసీ కంటెంట్‌ను చెక్ చేస్తున్నారు. వెబ్‌సైట్‌కు అనుబంధంగా ఉన్న మరికొన్ని దేశీయ, విదేశీ సర్వర్ల వివరాలను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దీనికితోడు, రవికి చెందిన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి, ఇప్పటివరకు కనీసం రూ. 3 కోట్లు పైగా అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒంటరిగా ఉంటున్న రవి, భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా విదేశాల్లోనే ఉంటూ ఈ పైరసీ వ్యవస్థను నడిపినట్లు దర్యాప్తులో బయటపడుతోంది. ఈ కేసుతో కలిసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పైరసీపై కొంతవరకు ఉక్కుపాదం పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.








