హైదరాబాద్ (Hyderabad) బాచుపల్లి (Bachupally) ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెడ్డీస్ ల్యాబ్ (Reddy’s Lab) సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఓ ట్రావెల్ బ్యాగు (Travel Bag) కనిపించడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది. బ్యాగు నుంచి భరించలేని దుర్వాసన రావడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బ్యాగును పరిశీలించగా, అందులో గుర్తు తెలియని యువతి మృతదేహం (Dead Body) ఉండటాన్ని గుర్తించారు. యువతి మెరూన్ కలర్ చుడిదార్ (Maroon Churidar) ధరించి ఉన్నట్టు తెలిపారు. ఆమె వయసు సుమారు 25 నుండి 30 ఏళ్ల మధ్యగా ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ (DCP Suresh Kumar) విచారణ చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన చుట్టూ అనేక అనుమానాలు నెలకొన్నాయి. మృతురాలిని గుర్తించేందుకు పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ కేసు హత్యగా నిర్ధారించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.