హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన ఉమ్మడి దాడుల్లో భారీ ముఠా పట్టుబడింది. ఈ ఆపరేషన్‌లో ఒక అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన వారిలో ఒక అంతర్రాష్ట్ర పెడ్లర్, ఒక లోకల్ పెడ్లర్ మరియు ముగ్గురు సబ్-పెడ్లర్లు ఉన్నారు. వీరి నుంచి పోలీసులు భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువ సుమారు రూ. 63.65 లక్షలు ఉంటుందని అంచనా. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, వాహనాలు, నగదును టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు.
18 ఏళ్ల విద్యార్థి సాయి నిఖిల్ ఆగడాలు
ఈ కేసులో ముఖ్యంగా 18 ఏళ్ల విద్యార్థి సాయి నిఖిల్ యాదవ్ అరెస్టవ్వడం కలకలం రేపుతోంది. చిల్కలగూడ పోలీసులు ఇతడిని పట్టుకోగా, ఇతని నుంచి రూ. 11.50 లక్షల విలువైన 115 గ్రాముల ఎండీఎంఏ (MDMA) స్వాధీనం చేసుకున్నారు. చదువు మధ్యలోనే ఆపేసిన సాయి నిఖిల్, జల్సాలకు, వ్యసనాలకు బానిసయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సబ్-పెడ్లర్‌గా మారాడు.
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సాయి నిఖిల్ తన వ్యక్తిగత ఫోన్ వాడకుండా, ఇతరుల పరికరాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా డ్రగ్ నెట్‌వర్క్‌ను నడిపినట్లు విచారణలో తేలింది. నిందితుడిపై ఇప్పటికే సనత్‌నగర్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్లలో డ్రగ్స్ కేసులు నమోదై ఉన్నాయి.
సమన్వయంతో పోలీసుల మెరుపు దాడులు
H-NEW బృందాలు చిల్కలగూడ, సనత్‌నగర్, ఆదిభట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో అత్యంత రహస్యంగా, సమన్వయంతో దాడులు నిర్వహించి ఈ ముఠా ఆట కట్టించాయి. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని డిసిపి వైభవ్ గైక్వాడ్ హెచ్చరించారు.








