గ్రేటర్ హైదరాబాద్ పరిపాలనలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర విస్తరణ, జనాభా పెరుగుదల, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ మరియు నివాస ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుత జీహెచ్ఎంసీ యథావిధిగా కొనసాగుతుండగా, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లను కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్లను కలిపి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐటీ కారిడార్ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, వేగంగా విస్తరిస్తున్న నివాస కాలనీలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా ఈ పునర్విభజన చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇక సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్ఎంసీ కొనసాగనుంది. మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్‌ను ప్రభుత్వం నియమించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయనే పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.
నగర పాలనను మరింత సమర్థవంతంగా, ప్రజలకు చేరువగా మార్చాలనే లక్ష్యంతో తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ భవిష్యత్ అభివృద్ధికి కీలక మలుపు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నగర పరిపాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయంగా, పరిపాలనా పరంగా ఇది హాట్ టాపిక్‌గా మారింది.








