హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో సెల్లార్ తవ్వకాల సమయంలో భయానక ఘటన చోటుచేసుకుంది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా మట్టిదిబ్బలు కుప్పకూలి ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత మట్టిదిబ్బల కింద నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు తండ్రీకొడుకులు కాగా, బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమే కారణమా?
స్థానికుల కథనం ప్రకారం.. సెల్లార్ తవ్వకాలు జరుపుతున్నప్పుడు జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ, కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాక, రాత్రివేళ పెద్ద ఎత్తున పేలుళ్లు జరుగుతున్నాయని, ఈ విషయం గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.