ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మునుపెన్నడూ లేని స్థాయిలో దిగజారిపోయాయి. స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్నీ వదలని పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి చావునూ రాజకీయాలకు వాడుకుంటున్న టీడీపీ తీరుపై ప్రజలు విస్తుపోతున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రస్తావననే పొరుగు రాష్ట్రాల ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
జోగి రమేష్ ఇంటికి టీడీపీ అల్లరి మూకలు పెట్రోల్ బాంబ్‌తో నిప్పుపెట్టారు. మాజీ మంత్రిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం బయల్దేరారు. వైఎస్ జగన్ పర్యటన రూట్ మ్యాప్‌లో స్వల్ప మార్పులు జరగడం, భారీగా అభిమానులు తరలిరావడంతో ఇబ్రహీంపట్నం చేరుకోవడంలో ఆలస్యం జరిగింది. తన అభిమాన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షుడు డి.రాంబాబు గ్రామస్తులతో కలిసి ఇబ్రహీంపట్నానికి వచ్చారు.
జగన్ ఇంకా చేరుకోముందే ఘటన
జోగి రమేష్ ఇంటికి వైఎస్ జగన్ చేరుకోవడానికి సమయం పడుతుందన్న సమాచారం రావడంతో, అప్పటివరకు అక్కడే ఉన్న రాంబాబు గ్రామస్తులతో కలిసి మధ్యాహ్న భోజనానికి వెళ్తుండగా రోడ్డుపై కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఆయన మేనల్లుడు కూడా అక్కడే ఉన్నాడు. వెంటనే సీపీఆర్ చేసి గొల్లపూడి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆసుపత్రికి చేరుకునేలోపే ఆయన మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో వైఎస్ జగన్ ఇంకా వెస్ట్ బైపాస్ ప్రారంభంలోనే ఉన్నారు. రాంబాబు కుప్పకూలిన ప్రాంతంలో ఎలాంటి జనసందోహం కూడా లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వాస్తవానికి రాంబాబు చాలా కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు, బంధువులు స్పష్టం చేస్తున్నారు.
చావునూ జగన్ పర్యటనతో లింక్ చేసే ప్రయత్నం
ఈ విషాద ఘటనను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ, కూటమి ప్రభుత్వం, టీడీపీ అనుకూల మీడియా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మరో దుష్ప్రచారానికి తెరలేపడం వైసీపీకి ఆగ్రహం తెప్పించింది. కూటమి పెద్దల ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో అర్ధరాత్రి జగ్గయ్యపేట పోలీసులు హైడ్రామా సృష్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నప్పుడే మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని పోలీస్ అధికారి ఒత్తిడి చేసినట్లు సమాచారం. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావు, మొండితోక జగన్‌మోహన్‌రావు తదితరులు రాంబాబు భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు మృతదేహాన్ని చిల్లకల్లులోని ఆయన నివాసానికి తరలించారు.
డెడ్‌బాడీతో అర్ధరాత్రి పోలీసుల హైడ్రామా
ఇక్కడితో ఆగకుండా, అర్ధరాత్రి సమయంలో డి.రాంబాబు మృతిపై కేసు నమోదైందంటూ పోలీసులు హడావిడి సృష్టించారు. పోస్టుమార్టం చేయాలంటూ అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో జగ్గయ్యపేట పోలీసులు మృతదేహాన్ని బలవంతంగా తీసుకెళ్లడంపై కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. సాధారణంగా ఎవరైనా మరణిస్తే.. తీవ్ర అనుమానాలు ఉన్నప్పుడే కుటుంబ సభ్యులు పోస్టుమార్టానికి అంగీకరిస్తారు. ఏ మతానికి చెందినవారైనా, మృతుడి అంత్యక్రియలు గౌరవంగా జరగాలని కుటుంబ సభ్యులు కోరుకోవడం సహజం. అలాంటి సందర్భంలో అనారోగ్యంతో.. సహజ మరణం పొందిన వ్యక్తి భౌతికకాయానికి అంతిమసంస్కరణ జరగనీయకుండా..కుటుంబసభ్యులు వద్దని చెబుతున్నా పోస్టు మార్టంకు తరలించి రాజకీయ కుట్రగా మలిచే ప్రయత్నం చేయడం పట్ల ప్రజలు, విశ్లేషకులు ఈసడించుకుంటున్నారు.
చావుతోనూ రాజకీయమా?
బంధువులు రాంబాబుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ఆయన మరణాన్ని వైఎస్ జగన్‌కు అంటగట్టే ప్రయత్నం చేయడం ఎంత వరకు న్యాయమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యక్తి చావునూ రాజకీయ లాభాల కోసం వాడుకుంటూ దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. మానవత్వం, సానుభూతి అన్న మాటలు పూర్తిగా కనుమరుగై, రాజకీయ ప్రయోజనాల కోసం ఏ హద్దులనైనా దాటుతున్న తీరే నేటి ఏపీ రాజకీయాల దుస్థితికి అద్దం పడుతోందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.








