ఇండియన్ హెల్త్ ఏజెన్సీ దేశ ప్రజలకు HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) గురించి ఆసక్తికరమైన వార్తను షేర్ చేసింది. చైనాలో విజృంభిస్తున్నవైరస్ గురించి ఇండియన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ వైరస్ ప్రస్తుతం చైనాలో వేగంగా వ్యాపిస్తున్నా, భారతదేశంలో ఈ వైరస్‌కు సంబంధించి ఎలాంటి కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదని ఇండియన్ హెల్త్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చింది.
చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్
హ్యూమన్ మెటాన్యుమో వైరస్ ఒక శ్వాసకోశ వ్యాధికి కారణమయ్యే వైరస్. ఇది కొవిడ్-19 వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది, ముఖ్యంగా జ్వరం, దగ్గు, మరియు శ్వాస సంబంధిత సమస్యల రూపంలో కనిపిస్తుంది. చైనాలో ఈ వైరస్ ముఖ్యంగా చిన్నారుల్లో వేగంగా వ్యాపిస్తోంది, అందుకే ఈ వైరస్‌పై ప్రపంచ దేశాలన్నీ ప్రత్యేక దృష్టి సారించాయి.
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి పుట్టుకొచ్చింది చైనా నుంచే కావడం, ఆ వైరస్ సృష్టించిన బీభత్సం కారణంగా ప్రజలంతా జంకుతున్నారు. ఇప్పటికే చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ గురించి ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి.