తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వర్షాలు (Rains) దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల భద్రత (Students Safety) దృష్ట్యా విద్యాసంస్థలకు (Educational Institutions) ప్రభుత్వం (Government) సెలవులు (Holidays) ప్రకటించింది. ముఖ్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నేడు మూతపడ్డాయి. శ్రీకాకుళం, విశాఖ, అల్లూరి జిల్లాల్లో కూడా కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా, ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండగా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ అల్పపీడనం మంగళవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.








