బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనమై తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అనూహ్యంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తా తీరం వైపు పయనిస్తోందని, ఈ పరిస్థితి కారణంగా రేపు ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, ఉత్తర గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేయబడింది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని అధికారులు సూచించారు.
బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్టంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు మూడో నంబరు హెచ్చరిక జారీ చేయనున్నట్లు తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతోంది. దీని కదలికలను అంచనా వేయడం కష్టతరమవుతోంది.